Pawan Kalyan Brother Konidela Naga Babu Re Entry In Jabardasth TV Show: నటుడు, నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి తన సోదరుడికి తోడుగా నిలిచాడు. రాజకీయాల్లోకి వచ్చాక కామెడీ షో వదిలేసిన మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. పుష్కర సంబరం సందర్భంగా కామెడీ షోలోకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు మళ్లీ మేకప్ వేసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
సినీ పరిశ్రమలో నటుడు, నిర్మాతగా కొనసాగుతున్న మెగా బ్రదర్ కొణిదెల నాగేంద్ర బాబు అలియాస్ నాగబాబు ఏపీ రాజకీయాల్లో బిజీగా కొనసాగుతున్నారు. తన సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోడుగా రాజకీయాల్లో ఉన్నారు.
వినోద రంగంలో దశాబ్దాలు కొనసాగిన మెగా బ్రదర్ నాగబాబు రాజకీయాల్లోకి ప్రవేశించారు. జనసేన పార్టీకి తోడుగా ఆయన పని చేస్తూ ఇటీవల ఏపీ ఎమ్మెల్సీగా నియమితులైన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీగా.. జనసేన పార్టీ నాయకుడిగా ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో జడ్జిగా కొన్ని సంవత్సరాలు కొనసాగారు. ఆ షో ప్రారంభం నుంచి వైఎస్సార్ సీపీ నాయకురాలు ఆర్‌కే రోజాతో కలిసి జడ్జిగా నాగబాబు వ్యవహరించారు. అనంతరం రాజకీయాల్లో బిజీ కావడంతో ఆ షో నుంచి వైదొలిగారు.
2013లో ప్రారంభమైన జబర్దస్త్ షో ఈ ఏడాదితో 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పుష్కర సంబరం ఈ టీవీ గ్రాండ్‌గా నిర్వహిస్తోంది. జబర్దస్త్ పుష్కర వసంతాలు నిర్వహించడంతో వాటికి ముఖ్య అతిథిగా తొలి జడ్జిగా వ్యవహరించిన నాగబాబును పిలిచారు.
జబర్దస్త్ 12 వసంతాల వేడుకలకు సంబంధించి ప్రొమో విడుదల చేశారు. ఆ ప్రొమోలో నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. కొన్నేళ్ల తర్వాత తిరిగివచ్చిన నాగబాబు తన జడ్జి స్థానంలో కూర్చున్నారు. 'కావాల్సిన వాడు వచ్చినప్పుడు ఆనందపడాలే. కానీ ఆశ్చర్యపోతారేంట్రా కుయ్యా.. మనల్ని ఎవడ్రా ఆపేది' అని నాగబాబు డైలాగ్ కొట్టారు.
ఇక ఈ వేడుకలో జబర్దస్త్ షోలో గతంలో పని చేసిన ఆర్టిస్టులు చమ్మక్ చంద్ర, అదిరే అభి, రైజింగ్ రాజు, బలగం వేణు, హైపర్ ఆది, ధన్‌రాజ్, గెటప్ శ్రీను, షకలక శంకర్ వారిని అందరినీ పిలిపించారు. సుదీర్ఘ కాలం పని చేసిన ఆర్టిస్టుల కాళ్లు కడిగారు. ఈ షోకు యాంకర్లుగా పని చేసిన అనసూయ, రష్మీ గౌతమ్, సౌమ్య రావు కూడా సందడి చేశారు.