YS Vijayamma Kiss To Ex CM YS Jagan And Bharathi At YSR Jayanthi: రాజకీయ విబేధాలతోపాటు కుటుంబం వివాదాలతో న్యాయస్థానం చేరిన వైఎస్సార్ కుటుంబ వివాదాలు తగ్గిపోయినట్టు కనిపిస్తున్నాయి. వైఎస్సార్ జయంతి కార్యక్రమం ఆ కుటుంబాన్ని ఒక్క చోటకు చేర్చింది. వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్, భారతి ఫొటోలు వైరల్‌గా మారాయి.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి కార్యక్రమాలు మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్సార్‌కు నివాళులర్పించారు. వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఉన్న వైఎస్సార్ ఘాట్‌ను వైఎస్సార్ కుటుంబం సందర్శించి నివాళులర్పించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మాజీ సీఎం వైఎస్ జగన్ తన సతీమణి వైఎస్ భారతితోపాటు తల్లి వైఎస్ విజయమ్మ కలిసి నివాళులర్పించారు.
అంతకుముందు పార్టీ నాయకులు, మత పెద్దలతో కలిసి వైఎస్ కుటుంబం ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంది. అనంతరం వైఎస్సార్ సమాధికి వైఎస్ విజయమ్మ, జగన్ పూలమాలలు వేసి నివాళుర్పించారు. అక్కడే ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా వైఎస్ విజయమ్మ నిలిచారు. కుటుంబం వివాదం, ఆస్తుల గొడవ జరుగుతున్న సమయంలో తల్లీ కొడుకులు, కోడలు పలకరించుకుంటారా? లేదా? అని చర్చ జరిగింది. కానీ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మను కొడుకు కోడలు జగన్, భారతి పలకరించారు.
వైఎస్సార్ ఘాట్‌కు వచ్చిన సమయంలో తల్లి విజయమ్మను జగన్ పలకరించాడు. అనంతరం వెళ్లే సమయంలో కూడా 'అమ్మా' అని పిలిచి వెళ్లొస్తానంటూ ఆమెకు చెప్పి వెళ్లాడు. ఆ సమయంలో జగన్‌కు విజయమ్మ ముద్దు ఇచ్చింది.
కార్యక్రమం ముగిసిన అనంతరం వెళ్తున్న సమయంలో విజయమ్మకు ఆమె కోడలు, జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా పలకరించారు. ఈ సందర్భంగా కుశల ప్రశ్నలు అడిగిన అనంతరం భారతికి కూడా వైఎస్ విజయమ్మ ముద్దు ఇచ్చినట్లు దృశ్యాలు కనిపిస్తున్నాయి.