MLC Kavitha Letter to AP CM Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. యటపాట, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. "ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత పోలవరం ముంపు పేరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను చీకటి ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయించుకున్నారు. 2014లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మీరు పట్టుబట్టి ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసుకున్నారు. తద్వారా లోయర్ సీలేరు పవర్ ప్లాంట్‌ను లాగేసుకొని తెలంగాణలో కరెంట్ కష్టాలకు కారకులయ్యారు. పోలవరం పేరుతో భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని ముంచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏడు మండలాలను ఏకపక్షంగా విలీనం చేసుకోవడంతో భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్న, పట్టణాన్ని ఆనుకొని ఉన్న యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భద్రాచలం రాముల వారి గుడి మన్యం భూములు పురుషోత్తపట్నం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నాయి. రాములవారు తెలంగాణలో ఉంటే ఆయన మన్యం భూములు ఏపీలో ఉండటంతో ఆ భూముల్లో ఇష్టారాజ్యంగా కబ్జాలు కొనసాగుతున్నాయి. కబ్జాలను అడ్డుకునే ప్రయత్నం చేసిన భద్రాచలం రామాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాదేవి గారిపై కబ్జాదారులు దాడి చేసిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నది. రాముడి పేరు చెప్పి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు భాగస్వామిగా ఉన్నారు. అదే రాములవారు కొలువై ఉన్న భద్రాచలం పట్టణాన్ని పోలవరంలో ముంచేసే కుట్రలు చేస్తున్నారు.
యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాలు ఏపీలో అంతర్భాగంగా ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలు విద్య, వైద్యం సహా ఇతర సేవలు పొందడానికి, ఉపాధిని అందిపుచ్చుకోవడానికి వందల కి.మీ.ల దూరం వెళ్లాల్సిన దుస్థితి నెలకొన్నది. ఆ ఐదు గ్రామాల ప్రజల సమస్యలను చూసి చలించిపోని వారు మానవతావాదులే కారనే విషయాన్ని గుర్తించాలి. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడంతో పాటు భద్రాచల రాముల వారి భూముల పరిరక్షణ కోసం వెంటనే యటపాట, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను." అని లేఖలో ఎమ్మెల్సీ కవిత కోరారు.
Also Read: No Rains: వానల కోసం ఎదురుచూపులు.. నష్టపోతున్న రైతన్నలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook