42% BC Reservation: రాజకీయంగా తీవ్ర సంచలనం రేపిన బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేసింది. ఈ నిర్ణయంతో బీసీ సామాజికవర్గం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమమైంది.
Also Read: Schools Holidays: విద్యార్థులకు బంపర్ న్యూస్.. 10 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు
మంత్రివర్గ నిర్ణయాలు ఇవే..
రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు మంత్రివర్గ సమావేశం మరో శుభవార్త ప్రకటించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
1. మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ప్రభుత్వం ఆమోదించింది. విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లోనూ బీసీ లకు 42 శాతం రిజర్వేషన్స్ ప్రాతినిధ్యం కల్పించే రెండు బిల్లులను అదే రోజు అసెంబ్లీలో ఆమోదించింది. ఇటీవలే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై గౌరవ హైకోర్టు కూడా నెలాఖరులోపు రిజర్వేషన్స్ ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటన్నింటినీ చర్చించిన మంత్రివర్గం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
Also Read: Salaries Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. జీతాలు 30-34 శాతం పెరిగే ఛాన్స్!
సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీ డెడికేటేడ్ కమిషన్ ను నియమించింది. రాష్ట్ర ప్రణాళిక విభాగం అధ్వర్యంలో కుల గణన చేపట్టింది. వీటి ఆధారంగానే అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదం చేసుకుంది. అందుబాటులో ఉన్న ఎంపిరికల్ డేటా ఆధారంగా, జనాభా ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని తీర్మానించింది. బీసీల రిజర్వేషన్ల ను ఖరారు చేసేందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీలకు మండలం యూనిట్ గా, ఎంపీపీ, జడ్పీటీసీలకు జిల్లా యూనిట్ గా, జడ్పీ ఛైర్మన్లకు రాష్ట్రం యూనిట్ గా పరిగణిస్తారు.
2. బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుగుణంగా రాష్ట్రంలో అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ చట్టంలో చేయాల్సిన సవరణలకు అవసరమైన చర్యలు చేపడుతుంది.
3. రాష్ట్రంలో కొత్తగా రెండు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. ఎయిమిటీ (AMITY) యూనివర్సిటీ, సెయింట్ మేరీ రిహాబిలిటేషన్ (Saint Marys Rehabilitation) యూనివర్సిటీ లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమిటీ యూనివర్సిటీలో మన తెలంగాణ విద్యార్థులకు, అంటే మన స్థానిక విద్యార్థులకు 50 శాతం అడ్మిషన్లకు అవకాశం కల్పించాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది.
4. సంగారెడ్డి జిల్లాలో ఇటీవల రెండు కొత్త మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పడ్డ జిన్నారం, ఇంద్రీశం మున్సిపాలిటీల పరిధిలో చేర్చే 18 గ్రామ పంచాయతీలను డీ లిస్టింగ్ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
5. రాష్ట్రంలో అధునాతనంగా గోశాలల ఏర్పాటు, నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. వచ్చే కేబినేట్ సమావేశంలోపు కమిటీ తమ నివేదికను అందించాలని గడువు నిర్ణయించింది.
ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పశుసంవర్థక శాఖ రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను, కొత్తగా నిర్మించే గోశాల డిజైన్లను మంత్రివర్గ భేటీలో ప్రదర్శించారు. రాష్ట్రంలో 306 గోశాలలున్నాయి. హైదరాబాద్లో ఎన్కేపల్లి, వెటర్నరీ యూనివర్సిటీ, వేములవాడ, యాదగిరిగుట్టలో అత్యాధునికంగా గోశాలలు నిర్మించాలని నిర్ణయించారు. వీటితో పాటు రాష్ట్రంలో ఉన్న గోశాలల రిజిస్ట్రేషన్లు, వాటి నిర్వహణపై సమగ్ర విధాన పత్రం రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
6. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
కొత్త సంప్రదాయం
ఈసారి రాష్ట్ర మంత్రివర్గం కేబినేట్ భేటీలకు సంబంధించి కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, అమలుపై సమీక్ష జరిపింది.
2023 డిసెంబర్ 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు 18 కేబినెట్ సమావేశాలు జరిగాయి. ఈరోజు 19వ సమావేశం జిరగింది. గతంలో జరిగిన సమావేశాల్లో మొత్తం 327 అంశాలను చర్చించింది. వీటిలో 321 అంశాలను కేబినేట్ ఆమోదించింది. వీటి అమలు పురోగతిని శాఖలవారీగా అధికారులతో మంత్రివర్గం చర్చించింది.
కొత్తగా 22 వేల ఉద్యోగాలు
ఈ ఏడాదిన్నర వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. వీటితో పాటు మరో 17084 ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. కొత్తగా 22033 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం చర్చించింది.
వివిధ విభాగాల్లో పని చేస్తున్న ప్రతీ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పనితీరును సమీక్షించేందుకు వీలుగా వారి ఆధార్, పూర్తి వివరాలు సేకరించాలని ఆర్థిక శాఖను మంత్రివర్గం ఆదేశించింది.
ప్రభుత్వ ఉద్యోగుల హాజరుతో పాటు విధినిర్వహణలో జవాబుదారీతనం పెంచేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి నియమించిన అధికారుల కమిటీ కి ఈ బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. రెండు నెలల్లో పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook